Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శాస్త్రవేత్తను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టిన ఘనత చంద్రబాబుదే!

అవును, శాస్త్రవేత్తగా పనిచేస్తున్న ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి పీఠంపై కూర్చోబెట్టడంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిదే కీలక భూమిక. 2002లో అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కలాం భారత రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేశారు. నాడు జరిగిన ఘటనలను ఓమారు గుర్తు చేసుకుంటే... కేంద్రంలో అటల్ బిహారీ వాజ్ పేయి సారధ్యంలో నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎన్డీఏ) అధికారంలో ఉంది. అప్పటికి ఎనిమిదేళ్లుగా ఏపీ సీఎంగా విధులు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీఏ కన్వీనర్ గా ఉన్నారు. ఇక భారత రాష్ట్రపతిగా హిందుయేతర వ్యక్తిని, ముఖ్యంగా మైనారిటీ వర్గానికి చెందిన ప్రముఖుడిని నియమించాలని ప్రధాని వాజ్ పేయి నిర్ణయించారు. ఈ మేరకు ముగ్గురు మైనారిటీ నేతల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసి, ఎన్డీఏ కన్వీనర్ హోదాలో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేశారు. జాబితాలోని మూడు పేర్లలో ఒకటిగా ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం పేరుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. శాస్త్రవేత్తగా ఉన్న కలాం అందుకు ఒప్పుకుంటారా? అన్న వాజ్ పేయి ప్రశ్నకు, కలాంను ఒప్పించే బాధ్యత తనదేనని చంద్రబాబు సమాధానమిచ్చారు. వెనువెంటనే చెన్నైలో ఉన్న కలాంకు చంద్రబాబు ఫోన్ చేశారు. ‘‘రాష్ట్రపతి పదవికి మిమ్మల్ని కేంద్రం ఎంపిక చేసింది’’ అని చంద్రబాబు తెలపగా ‘‘నా పనిలో నేనున్నా, ఇవన్నీ ఎందుకు’’ అని కలాం బదులిచ్చారట. అయితే ‘‘నో’’ అని మాత్రం చెప్పవద్దంటూ బతిమిలాడిన చంద్రబాబు ఎట్టకేలకు కలాంను ఒప్పించారు. ఆ తర్వాత కలాంతో మాట్లాడిన కేంద్రం, రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది.

More Telugu News